నేటి సాక్షి వికారాబాద్ :పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించిన డిఎస్‌బి (DSB) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.గోపాల్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, గోపాల్ గారిని శాలువాతో సత్కరించి, ఆయన సేవలకు గుర్తుగా జ్ఞాపికను అందజేశారు. పోలీసు శాఖలో ఆయన పోషించిన పాత్రను, అంకితభావాన్ని ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ముఖ్యంగా పోలీస్ శాఖలో 41 సంవత్సరాల పాటు నిష్కళంకమైన సేవలు అందించడం అనేది సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, క్రమశిక్షణతో విధి నిర్వహణలో నిబద్ధతను చాటుకున్న గోపాల్ గారి ప్రయాణం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన చొరవ, వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం తోటి సిబ్బందికి, యువ పోలీసు అధికారులకు ఆదర్శప్రాయమని ఆమె సూచించారు.అనంతరం ఎస్పీ గోపాల్ గారి భవిష్యత్తు గురించి ఆకాంక్షిస్తూ.. సుదీర్ఘ కాలం పాటు సమాజ సేవలో బిజీగా గడిపిన ఆయన, ఇకపై తన కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి ఆరోగ్యంతో, ప్రశాంతమైన శేష జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడిగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.ఈ ఆత్మీయ వీడ్కోలు వేడుకలో ఏఓ ఖాజా మోహినోద్దీన్ జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ పాల్గొని గోపాల్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు డిపిఓ (DPO) సిబ్బంది పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.





