నేటి సాక్షి గజ్వేల్ ఫిబ్రవరి 19: అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కాంగ్రెస్ పార్టీ రాక్షస ఆనందం పొందుతోందని మాజీ ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ ఘాటుగా విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారనే భయంతో కొందరిని ప్రేరేపించి ఆర్ అండ్ ఆర్ కాలనీలో గొడవలు సృష్టించారని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నేతలపైనే అక్రమ కేసులు నమోదు చేయించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అన్నారు.ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘటనల్లో కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయకుండా కేవలం టీఆర్ఎస్ నాయకులపైనే కేసులు పెట్టడం అధికారుల వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తోందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల అవసరాలు తీర్చే నాయకుడే నిజమైన ప్రజాస్వామ్య నాయకుడిగా నిలుస్తాడని పేర్కొన్నారు.అలాగే, కే. చంద్రశేఖర్ రావు సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కేసులకు, బెదిరింపులకు భయపడలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యమని దేవీ రవీందర్ సూచించారు.





