నేటి సాక్షి గజ్వేల్, ఫిబ్రవరి 23: కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ కుల సంఘాల భవనాలను ఏర్పాటు చేసినట్లు గజ్వెల్ –ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ చందన మాట్లాడుతూ, గత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కెసిఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అన్ని కుల సంఘాలు, ప్రజాసంఘాల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించడం జరిగిందన్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న భవనాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని అన్నారు.మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో నిర్మించిన భవనాలకు సున్నం వేయడం తప్ప గజ్వేల్‌లో కొత్తగా అభివృద్ధి పనులు చేయలేదని ఆమె ఘాటుగా విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న కుల సంఘాల భవనాలకు ప్రత్యేక నిధుల ద్వారా పనులు పూర్తిచేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం అధ్యక్షులు గడియారం వెంకటాచారి, కొక్కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడియారం వెంకటేష్ చారి, గడియారం సామీ చారి, ప్రధాన కార్యదర్శి ముత్యాల విఠలాచారి, అరుణోజి లక్ష్మీనరసింహ చారి, కోశాధికారి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి అరుణ శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ పెట్టా చారి, డాక్టర్ వాసవచారి, దత్తాత్రి చారి, యాదగిరి చారి, దశరథం చారి హాజరయ్యారు.





