జమదగ్ని,ఎల్లమ్మ అమ్మవారి కటాక్షంతో జాలిగామలో కళ్యాణ మహోత్సవం సిద్దిపేట జిల్లా:—- గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శ్రీ జమదగ్ని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు బోనాలతో, భక్తులు హారతులతో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో కళకళలాడాయి.ఈ సందర్భంగా గౌడ సంఘం బాధ్యులు మాట్లాడుతూ, గ్రామ దేవతల కటాక్షంతో జాలిగామ గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతకు ప్రతీకలని వారు పేర్కొన్నారు.కార్యక్రమానికి ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ నక్క రాములు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి సంప్రదాయోత్సవాలు నిర్వహించడం సంతోషకరమని, భక్తి భావం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.మొత్తానికి, శ్రీ జమదగ్ని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం జాలిగామ గ్రామంలో భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో తాళ్ల శ్రీనివాస్ గౌడ్, భూమా గౌడ్ గురుమూర్తి గౌడ్, సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, అశోక్ గౌడ్,నర్సింలు గౌడ్, కృష్ణ గౌడ్, చంద్ర గౌడ్,యాదగిరి గౌడ్, బాలకృష్ణ గౌడ్, హరి గౌడ్, రాజు గౌడ్, సింహం గౌడ్ లతోపాటు ఆది జాంబవంతుల సంఘం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





