నేటి సాక్షి – ధర్మపురి*( రాధారపు నర్సయ్య )ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.*పూర్ణకుంభంతో ఘన స్వాగతం*కలెక్టర్ దంపతులు ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.*భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ఆదేశాలు*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి, ఆయురారోగ్యాలు కలగాలని, స్వామివారి దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ ప్రసాదించాలని ఆకాంక్షించారు.బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్ మరియు పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని సురక్షిత త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, మున్సిపల్ కమిషనర్, దేవస్థాన ఈవో, తహసీల్దార్లు, ఎంపిడివోలు, పోలీస్ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.______





