అక్రమ కట్టడాలకు అధికారులే కంచుకోట?గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో మున్సిపల్ ఖజానాకు గండి… మామూళ్ల మత్తులో మౌనం వహిస్తున్నారా అధికారులు?సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు అడ్డుకట్ట లేకుండా పెరిగిపోతుండగా, వాటిని నియంత్రించాల్సిన మున్సిపల్ మరియు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాత్రం అనుమానాస్పదంగా నిశ్శబ్దంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.నిబంధనలకు విరుద్ధంగా అనుమతుల కంటే ఎక్కువ అంతస్తులు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు, పార్కింగ్ లేకుండా నిర్మాణాలు, వాణిజ్య వినియోగాలకు అనుమతి లేకుండానే మార్పులు—ఇవి అన్నీ బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ అధికారుల నుంచి చర్యలు మాత్రం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.అనుమతులు ఒక విధంగా తీసుకుని, నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేతులు ఎత్తేయడం వెనుక భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిన వారు కాపాడుతున్నారన్న భావన పట్టణంలో విస్తరిస్తోంది.దీంతో మున్సిపాలిటీకి రావలసిన అభివృద్ధి ఛార్జీలు, పెనాల్టీలు, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతుండగా, ఆ నష్టం ప్రజా ఖజానాకు కాకుండా కొందరి వ్యక్తిగత లాభాలకు దారి తీస్తోందని పట్టణ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.ఇదే సమయంలో సాధారణ ప్రజలు చిన్న గది నిర్మించాలన్నా, ఇంటి మరమ్మతులు చేయాలన్నా నిబంధనల పేరిట నోటీసులు, జరిమానాలు, పనుల నిలుపుదల వంటి చర్యలు ఎదుర్కొంటున్నారని వారు వాపోతున్నారు. పెద్ద స్థాయి అక్రమ నిర్మాణాలపై మాత్రం మౌనం పాటించడం అధికారుల ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శిస్తున్నారు.“నిబంధనలు పేదలకేనా? పెద్దల అక్రమాలకు ఎందుకు మినహాయింపు?” అనే ప్రశ్న పట్టణంలో వినిపిస్తోంది.అక్రమ నిర్మాణాల కారణంగా పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తం అవుతోందని, భవిష్యత్తులో ట్రాఫిక్, డ్రైనేజీ, భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ ఆదాయాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





