నేటి సాక్షి, ఎండపల్లి:* విద్యుత్ సరఫరాలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న సిబ్బందిని సత్కరిస్తూ లైన్‌మ్యాన్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఎండపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజరాంపల్లి విద్యుత్ శాఖ ఏఈ బండి సమ్మయ్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఏఈ సమ్మయ్య మాట్లాడుతూ.. ఎండలు, వానలు, గాలివానలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో సిబ్బంది చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకు వెలుగు అందించడం గొప్ప సేవగా పేర్కొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఉత్తమంగా సేవలందించిన లైన్ మ్యాన్, సిబ్బందిని శాఖ తరుపున శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. సిబ్బంది తమ సేవలను గుర్తించి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు.





