నేటి సాక్షి, ఎండపల్లి:* అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎండపల్లి మండల కేంద్రం, కొండాపూర్, గుల్లకోట గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో శనివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్రను గుర్తు చేస్తూ పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కాగా విద్యార్థులు మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పే ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలను పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ ప్రతిభ కనబరుస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళా విద్యాభివృద్ధి వల్లే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయురాల కృషి ఎంతో గొప్పదని కొనియాడుతూ.. మహిళల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎండపల్లి సర్పంచ్ మారం సునీత-జలేందర్ రెడ్డి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దాశెట్టి రవీందర్ రెడ్డి (ఎండపల్లి), చుక్క మల్లికార్జున్ (కొండాపూర్), చందూరి రాజిరెడ్డి (గుల్లకోట), స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





