నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం 9వ వార్డులో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కౌన్సిలర్లతో కలిసి పాల్గొని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే స్థానిక ప్రజలతో మాట్లాడి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. కేవలం అధికారుల వల్ల మాత్రమే మార్పు సాధ్యం కాదని, ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా వేరు చేయాలని ప్రజలకు సూచించారు. అలాగే ఇంటి వద్దనే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేస్తే చెత్త సమస్యను సమర్థవంతంగా తగ్గించవచ్చని చెప్పారు.దోమల వ్యాప్తిని నివారించేందుకు కుండీలు, కూలర్లు వంటి చోట్ల నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత ఆసిఫాబాద్ లక్ష్యంగా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని వెంటనే మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి వీధులను శుభ్రపరిచారు. దోమల నివారణ కోసం మందు స్ప్రే చేయించడంతో పాటు, మంచినీటి ట్యాంకర్లను శుభ్రం చేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం బిన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజనంద్, టీఎంసీ, ఆర్పీ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





