నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 13 జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్ కవరకుంట్ల జయరాజ్ తెలిపారు. మదనపల్లెలో శనివారం జరిగిన అన్నమయ్య జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలాలు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వంటి హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. మార్చి 4న నిర్వహించిన “చలో విజయవాడ” కార్యక్రమంలో వేలాదిమంది జర్నలిస్టులు పాల్గొని హక్కుల కోసం గళమెత్తారని తెలిపారు. ఆ కార్యక్రమానికి హాజరైన సమాచార శాఖ మంత్రి పార్థసారథి జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సంస్థాగతంగా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ను బలోపేతం చేయాలని నాయకత్వానికి పిలుపునిచ్చారు. మార్చి 31న మదనపల్లె నగరంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు.కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు రామకృష్ణ రెడ్డి, నాగరాజు, హిదాయతుల్లా, శ్రీనివాసులు, జాకీర్, చంద్రతో పాటు షేక్ సలీం, గిరిశేఖర్, సైఫుల్లా, డా. తల్లా శ్రీనివాసులు, మంజునాద్, కార్తీక్, రవి తేజ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.





