నేటి సాక్షి, ఎండపల్లి:* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కర్ణాటకకు చెందిన బీజేపీ లోకసభ సభ్యుడు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా స్పందించారు. త్యాగాల చరిత్రను వక్రీకరించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సూర్య వ్యాఖ్యలను ఖండించారు. మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 14 సంవత్సరాల పాటు నిరంతర ఉద్యమాన్ని నడిపి దేశంలోని రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని పేర్కొన్నారు. బ్రిటిష్ వారు భారత్–పాకిస్థాన్‌ను వేరుచేసినట్టుగా అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేశారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు 60 సంవత్సరాల పోరాటం, 1200 మంది అమరుల బలిదానాలు, కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష వంటి సంఘటనలు చారిత్రాత్మకమని తెలిపారు. అలాంటి పవిత్ర పోరాటాన్ని దేశ విభజనతో పోల్చడం త్యాగాల చరిత్రను వక్రీకరించడమే కాకుండా తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేసినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.





