నేటి సాక్షి – కోరుట్ల (రాధారపు నర్సయ్య)*కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సంక్షేమ అంశాల సాధన కోసం చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు భారతీయ జనతా పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించి కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపారు.*శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలి*ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మబలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు.సమ్మె శిబిరాన్ని సందర్శించిన బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ, నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గుంటుక సదాశివ్, జిల్లా నాయకుడు సుదవేణి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండం గణేష్, సీనియర్ నాయకుడు గిన్నెల శ్రీకాంత్, మ్యాకల గణేష్, ధమ్మా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.*32 డిమాండ్ల సాధన కోసం సమ్మె*ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కోరుట్ల డిపో ఉద్యోగులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్ పీఆర్సీల అమలు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీకి సంబంధించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 32 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కార్మికులు కోరుతున్నారు.*ప్రభుత్వంతో చర్చలు విఫలం*సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచినా, ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని కార్మిక నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని కోరుట్ల డిపో ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ కార్మికుల వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మికులు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.*సంఘీభావానికి కార్మికుల కృతజ్ఞతలు*సమ్మె మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులకు ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల ఐక్యతతో తమ హక్కులను సాధించుకుంటామని వారు స్పష్టం చేశారు.!————





