నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 12పెద్దకడబూరు మండలంలోని ఐదో వార్డులో మౌలిక సదుపాయాల కొరత కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డులో సరైన మురికి కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ప్రాంతంలో సంచరించేందుకు ఇబ్బందులు పడుతుండగా, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు చెబుతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా వార్డులోని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారాయి. రోడ్లపై ప్రయాణించడం వాహనదారులకు ప్రమాదకరంగా మారగా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు నడవడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురికి కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.





