- తోడికోడలిపై కోపమే హత్యకు దారితీసిందా?
- సంచలనం సృష్టించిన ‘ఐదేళ్ల పాప’ మర్డర్ మిస్టరీ ముడి వీడినట్టేనా.?
- పక్కింటి ‘సైకో’గాడి ఖాతాలో వేసేందుకు ‘విఫలయత్నం’
- పోలీసుల అదుపులో ‘నిందితురాలు’?
- రాత్రంతా సంఘటనా స్థలంలోనే ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు
- రాత్రి నుంచి 40 మందిని విచారించిన పోలీసులు
- సౌదీ నుంచి వచ్చిన ‘పాప’ తాత, తండ్రి, బాబాయ్’లు
- ‘బిట్ కాయిన్’ బిజినెస్’లో రూ.35 లక్షలు మునిగిన ‘పిన్ని’?
- ఆ కోపం.. ఈర్ష్య.. ద్వేషంగా మార్చుకున్న ‘నిందితురాలు’
- తనకు లేని సంతోషాన్ని తోడికోడలుకెందుకు ఉండాలని ‘చిన్నారి’ని చిదిమేసిన వైనం?

నేటి సాక్షి, కోరుట్ల(రాధారపు నర్సయ్య): “సభ్యసమాజం’లో.. నానాటికీ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.! తనకు లేని సంతోషం.. ఇతరులకెందుకు..? తనకంటే ఎక్కువ సత్తెనాసైనా కావాలి.. లేదా.. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చుకుంటూనైనా ఉండాలని భావించిందా ఇల్లాలు.! తన బాధను- కోపంగా..కోపాన్ని-ఈర్ష్యగా.. ఈర్ష్యను-ద్వేషంగా మార్చుకుని ‘అభం-శుభం’ తెలీని ‘చిన్నారి’ ప్రాణాలను చిదిమేసి అనూహ్యంగా ‘పోలీసులకు చిక్కింది’.! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి ‘మర్డర్ మిస్టరీ’కేసుని కోరుట్ల పోలీసులు ‘ఒక్క రాత్రి’లో చేధించి ‘శభాష్.. కోరుట్ల పోలీస్.! అనిపించుకున్నారు.!!
డామిట్.!’కథ’ అడ్డం తిరిగిందేంటీ.!?
కోరుట్ల పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో శనివారం రాత్రి ఆకుల హితీక్ష(5) అనుమానాస్పదంగా మృతి చెందింది. తొలుత హితీక్ష ‘పాప కనిపించడం లేదు.. ఆచూకీ చెప్పండి’ అని సోషల్ మీడియాలో వైరలైన రెండు గంటల్లోనే.. పక్కింటి ‘బాత్రూం’లో ‘రక్తపు మడుగు’లో శవమై కనిపించిన వైనం గుండెల్ని పిండేసింది. ‘మొహర్రం’ పండుగ సందర్భంగా వేసిన ‘పులి వేషగాళ్ల’ను చూసి భయపడ్డ పాప.. బాత్రూంలో నల్లా గొంతులో గుచ్చుకుని చనిపోయిందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదే క్రమంలో పాప చనిపోయిన ‘బాత్రూం’గల ఇంట్లో నివసించే ‘కొడిపెల్లి విజయ్’ అనే ‘సైకో మనస్తత్వం’ గలిగి ఉన్న వ్యక్తి హితీక్షను గొంతుకోసి చంపేసి ఉంటారని వాదనలు వినిపించాయి. ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల రోదనల్లోనూ ‘అతనే చంపేశాడు కావచ్చు’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, పోలీసుల దర్యాప్తులో ‘అనూహ్యంగా..’ అసలు బాగోతం ఏంటో తెలిసిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. దీంతో స్థానికులు ‘డామిట్ ‘కథ’ ఇలా అడ్డం తిరుగుతోందేంటంటూ.. ముక్కున వేలేసుకుంటున్నారు.
హత్యా స్థలంలోనే ఎస్పీ సహా.. పోలీస్ టీం
సమాజంలో కలకాలం సృష్టించిన ‘చిన్నారి మృతి’ కేసును జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ‘ఛాలెంజింగ్’ తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మెట్ పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల, మెట్ పల్లి సీఐలు సురేష్ బాబు, అనిల్ కుమార్, కోరుట్ల, మెట్ పల్లి, మేడిపల్లి, కథలాపూర్ ఎస్సైలు చిరంజీవి, కిరణ్ కుమార్, శ్యామ్ రాజ్, నవీన్ కుమార్ తో తమదైన శైలిలో దర్యాప్తు మొదలెట్టారు. రాత్రికి రాత్రే ‘పోలీస్ డాగ్ స్క్వాడ్’ను తెప్పించి విచారణకు శ్రీకారం చుట్టారు. రాత్రంతా సంఘటన స్థలంలోనే ఉండి 40 మందిని విచారించారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అందులో ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ‘పోలీస్ ట్రీట్మెంట్’కు పనిచెప్పారు. సదరు మహిళను అదుపులోకి తీసుకుని ‘పోలీస్ మార్క్’ విచారణలో అసలు విషయాలు బయటకు వస్తుండడంతో విస్తుపోవడం పోలీసులవంతైంది.!

ఆ-అనుమానితురాలు పాప ‘పిన్ని’నేంట!?
పోలీసులకెదురైన చిక్కుముడులన్నీ జాగ్రత్తగా ఒక్కోటి విప్పుతూ వస్తున్నవారికి.. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఓ దృశ్యం.. ‘మిస్టరీ’ వీడేలా చేసిందంటున్నారు. చనిపోయిన ‘పాప’ పక్కింట్లో ‘బాత్రూం’లోంచి.. తన ఇంట్లోంచి.. పలుమార్లు హడావుడిగా తిరిగుతూ.. డ్రెస్ ఛేంజ్ చేసుకుని.. యథావిధిగా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉన్న ఆ ఇంటి కోడలు ‘మమత అలియాస్ మౌనిక’ను అనుమానితురాలిగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను ‘పోలీస్ డాగ్’తో పట్టుకుని ‘నిందితురాలి’గా అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

‘సైకో’గాడి ఖాతాలో వేద్దామనుకుని..
గత కొన్ని నెలలుగా.. పెంచుకున్న ఈర్ష్య.. ద్వేషం.. పగలను తీర్చుకునేందుకు పాప ‘పిన్ని’ మమత సమయం కోసం వేచి ఉంది. తల్లి నవీన కరీంనగర్ షాపింగ్ వెళ్లింది చూసింది. వాడకట్టులో ‘పెద్ద పులుల’ ఆటలను పిల్లలు చూస్తుండడం.. గత కొద్దిరోజులుగా పక్కింటి వారు ఇంట్లో లేకపోవడం..అదే సమయానికి వాన చినుకులు కూడా రావడం కలిసిసొచ్చినట్టుంది.
ఇదే అదునుగా..
‘పెద్దపులి’ భయానికి బాత్రూం లో దాక్కున్న ‘చిన్నారి హితీక్ష’ను ఓ పదునైన కత్తితో పొడిచి చంపేసిట్టు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే, అక్కడి నుంచి బయటికొచ్చి రక్తంతో తడిసిన బట్టలు మార్చుకుని.. ఎప్పటిలాగే ‘పాప’ కనిపించడం లేదని, వెదకడం.. అయ్యో పాపం బాత్రూంలో చనిపోయి కనిపించిందనడంతో అందరితో పాటు హాస్పిటల్ వెళ్లడం చేయడంతో పోలీసులు అనుమానించి ‘అదుపుతోకి’ తీసుకున్నారు. తాను చంపేసి.. ఆ నేరాన్ని పక్కింటి విజయ్ వాడకట్టులో ‘సైకో’గాడన్న ముద్రను నిజం చేద్దామనుకుని, వాళ్ల బాత్రూంలో హతమార్చినట్లు విచారణలో తేలిందని సమాచారం. కానీ, ఆ ఇంటి ‘అనుమానితుడు-విజయ్’ కొన్ని నెలలుగా స్థానికంగా లేక నర్సంపేటలో ఉంటుండడంతో కేసు మిస్టరీ వీడడంలో కీలక పాయింట్ గా పోలీసులు గుర్తించి తమ దర్యాప్తును ‘ఇంటి వారి’పైనే పెట్టి వేగవంతం చేసినట్టు సమాచారం.

హంతకురాలు ఒక్కరే నా?
అయితే.. పోలీసులు మర్డర్ కేసు దాదాపు ఛేదించినా? పాపను హతమార్చింది ‘ఆమె పిన్ని-మమత’ ఒక్కరే నా! లేక ఆమెతో కలిసి ఇంకెవరైనా ఈ ‘హత్యోదంతం’లో పాల్గొన్నారా? అని మరింతగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పాపను ‘బాత్రూం’లోనే చంపేసిందా? లేక ఇంకెక్కడైనా చంపిందా!? హత్యకు ఎలాంటి ఆయుధం వాడింది? దాన్నెక్కడ దాచి పెట్టింది? రక్తంతో తడిచిన తన బట్టలను ఏం చేసింది? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘మిస్టరీ’ని ఛేదించిన పోలీసులు చెప్పేదాకా వెయిట్ చేయకతప్పదు.
‘బిట్ కాయిన్’ బిజినెస్’ వల్లే ‘బిడ్డ’ను పొట్టన పెట్టుకుందా.?
ఈ విచారణలో మరో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హతురాలు చిన్నారి హితిక్ష తాత, తండ్రి రాము, బాబాయ్ లక్ష్మణ్ కవల పిల్లలు. రాముకు వేదాన్ష్ (7), హితీక్ష(5) ఉండగా, లక్ష్మణ్ కు ఇద్దరు ఆడపిల్లలు. అయితే, తండ్రి.. అన్నదమ్ములిద్దరు ఉపాధి నిమిత్తం ‘సౌదీ’లోనే ఉంటున్నారు. ఇందులో చిన్నారి హితీక్ష పిన్ని ‘మమత అలియాస్ మౌనిక’ గత కొన్ని నెలలుగా ‘బిట్ కాయిన్’ బిజినెస్’ చేస్తోందని సమాచారం. అందులో దాదాపు రూ.35 లక్షల వరకు నిండా మునిగిందని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. దీంతో కుటుంబంలో, చుట్టాల్లో, వాడకట్టులో మమతపై అందరికీ చులకన భావం ఏర్పడిందని తెలిసింది. వచ్చిన వారుగానీ, కుటుంబ సభ్యులు గానీ, వాడకట్టువాళ్లు గానీ ఆమెతో మాట్లాడకపోవడంతో తోడికోడలు నవీనపై ఈర్ష్య, ద్వేషం, పగ పెంచుకున్నట్టు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో తన అత్త, తోడికోడలుతో కలిసి సౌదీ వెళ్తున్నారని, అక్కడ తన ఇజ్జత్ మొత్తం పోతదని భావించి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. కాగా, పాపను చంపేశారని తెలుసుకున్న తాత, తండ్రి, బాబాయ్ సౌదీ నుంచి వచ్చారు. పోస్టుమార్టం అనంతరం కన్నీటి మధ్య జరిగిన అంత్యక్రియలు పట్టణ వాసులను కంటతడి పెట్టించింది.

కంటతడి పెట్టించిన.. అంతిమయాత్ర.!
సొంత పిన్ని చేతిలో దారుణహత్యకు గురైన చిన్నారి హితీక్ష అంతిమయాత్ర చూపరులందరినీ కంటతడి పెట్టించింది.సాయంత్రంలోగా ‘పోస్టుమార్టం’ నిర్వహించి ‘పాప-మృతదేహాన్ని’ కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.ఈలోపు ‘సౌదీ’నుంచి హితీక్ష తాత మదన్..తండ్రి రాము..బాబాయ్ లక్ష్మణ్ లు ఇంటికి చేరుకున్నారు. వారు ఇంటికి రాగానే గంభీరమైన వాతావరణం ఒక్కసారిగా ఏడుపులతో హోరెత్తిపోయింది.ప్రతీ ఒక్కరిలో దుఃఖం కట్టలు తెంచుకుంది.తాత..తండ్రి..తల్లి పాప శవపేటిక పై పడి రోదించినతీరు గుండెల్ని పిండేసింది.ఘల్లుఘల్లున పరుగెత్తుతూ వచ్చి ఒళ్లోవాలిపోవాల్సిన చిన్నారి.. విగతజీవిగా శవపేటికలో పడుకుండిపోయిన దృశ్యాన్ని చూసిన ఆ కుటుంబసభ్యుల దుఃఖాన్ని ఆపేతరం ఎవరివల్లాకాలేదు.అనంతరం ఇంటినుంచి శ్మశానం వరకు ‘వైకుంఠరథం’లో శవపేటికనుంచి ఊరేగించిన అంతిమయాత్రకు బంధుమిత్రులు..జనాలు పెద్దయెత్తున హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.హితీక్ష హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే సృష్టించింది.!





