నేటి సాక్షి, ఎండపల్లి:* నెలల తరబడి మరమ్మతులు లేక నిరుపయోగంగా మారిన గుల్లకోట గ్రామ శివారు (సలాంధ్రి మర్రి) ప్రాంతంలోని చేతి పంపుకు సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ప్రత్యేక చొరవతో పునర్జీవం లభించింది. వేసవి కాలంలో బాటసారులు, స్థానికుల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేతి పంపుకు మరమ్మతులు చేపించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ నేటి సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన సర్పంచ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి, సంబంధిత సిబ్బందితో శనివారం చేతి పంపును మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచడంతో స్థానికులు, బాటసారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ కావడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాకు, స్పందించి పరిష్కారం చూపిన సర్పంచ్‌కు అభినందనలు వెల్లివిరిశాయి.





