Monday, April 27, 2026

బండరాళ్లు కొట్టి బతికే వడ్డెరల కన్నీటి జీవితంఉపాధి అడ్డుకుంటున్నారని ఆవేదన… అధికారులు స్పందించాలని డిమాండ్

నేటి సాక్షి గజ్వేల్ :====పూట గడవాలంటే గుట్టలెక్కాలి… తిండి కోసం బండరాళ్లు కొట్టాలి… శ్రమే జీవనంగా మారిన వడ్డెర కుటుంబాలు ఇప్పుడు ఉపాధి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని జబ్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు తమ జీవనోపాధిని గ్రామంలోని కొంతమంది అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా ఎదుట కన్నీటి పర్యంతంగా ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామానికి చెందిన సుమారు 30 వడ్డెర కుటుంబాలు గత 70 ఏళ్లుగా అడవుల్లో లభించే పండ్లు, పలాలు సేకరించడం, గుట్టలపై ఉన్న బండరాళ్లను కొట్టి విక్రయించడం ద్వారానే జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ భూములు లేక, స్థిరమైన ఉపాధి లేక తాము ఈ వృత్తిపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నామని చెప్పారు.*తెల్లవారితే శ్రమే జీవితం*వడ్డెర కుటుంబాల జీవితం సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులను వదిలి పురుషులు, కొందరు మహిళలు కూడా గుట్టల వైపు ప్రయాణం చేస్తారు. చేతుల్లో కేవలం కొడవళ్లు, గునపాలు, హామర్లు, తాళ్లు మాత్రమే ఉంటాయి. కొందరైతే ఆహారం కూడా సరిగా తినకుండా నీటి బాటిల్ పట్టుకుని బయలుదేరతారని తెలిపారు.గుట్టలపైకి చేరాక పెద్ద బండరాళ్లను కొట్టి చిన్న ముక్కలుగా చేయడం, వాటిని కుప్పలుగా పేర్చడం, తర్వాత ట్రాక్టర్ లేదా లారీకి ఎక్కించడం వంటి పనులు చేస్తారు. ఈ పనిలో కాస్త జాగ్రత్త తప్పినా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గతంలో పలువురు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయని, కొందరికి శాశ్వతంగా ఆరోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయని వడ్డెరులు పేర్కొన్నారు.*రోజంతా శ్రమ… వచ్చిన డబ్బు మాత్రం తక్కువ*రోజుకు 10 నుంచి 12 గంటల పాటు గుట్టల్లో పని చేసినా వచ్చే ఆదాయం చాలా తక్కువని వడ్డెర కుటుంబాలు వాపోయాయి. కష్టపడి రాళ్లు కొట్టి అమ్మినా మధ్యవర్తుల చేతిలో తక్కువ ధరకు వెళ్లిపోతున్నాయని, ఆ డబ్బుతోనే పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, మందులు, కూలి అప్పులు తీర్చుకోవాల్సి వస్తోందని చెప్పారు. కొన్నిసార్లు పని చేసినా కొనుగోలుదారులు దొరకకపోతే ఆ రోజు ఆదాయం శూన్యమేనని తెలిపారు.*అడవిలో ఉపాధి… అక్కడి నుంచి వెళ్లగొట్టారు*ఇదే వృత్తితో కోమడిబండ అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న సమయంలో, మిషన్ భగీరథ పథకం కింద కోమడిబండ గుట్టపై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినప్పుడు అధికారులు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. “అక్కడే మా జీవనాధారం. అక్కడి నుంచి పంపించడంతో మా కుటుంబాలు కష్టాల్లో పడ్డాయి” అని వారు తెలిపారు.అటవీ ప్రాంతం నుంచి తరిమివేయడంతో ఉపాధి కోల్పోయి, చివరకు తమ స్వగ్రామమైన జబ్బాపూర్‌లోనే జీవనం కొనసాగించాల్సి వచ్చిందన్నారు.*గ్రామంలోనూ అడ్డంకులు*జబ్బాపూర్ గ్రామ పరిధిలో బండరాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి తమదేనని, గుట్టపై ఉన్న రాళ్లు కూడా తమవేనని చెబుతూ పని చేయనివ్వడం లేదని వడ్డెరులు వాపోయారు. “మా వృత్తి లేకపోతే మా పిల్లలకు అన్నం ఎలా పెట్టాలి?” అని ప్రశ్నించారు.అంతేకాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తమ ఉపాధిని అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారని వడ్డెర కుటుంబాలు పేర్కొన్నాయి.*ఫిర్యాదులు చేసినా స్పందన లేదు*ఈ సమస్యపై స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీస్ స్టేషన్, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “మమ్మల్ని ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేస్తారు. ఓటు వేయించుకుంటారు. కానీ మా బతుకు సమస్య ఎవరికీ పట్టడం లేదు” అని వడ్డెరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.*పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తు ప్రమాదంలో*ఉపాధి నిలిచిపోతే తమ పిల్లల చదువులు ఆగిపోతాయని, ఇంటి ఖర్చులు నడవవని, అప్పుల భారం పెరిగిపోతుందని వారు తెలిపారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న తమ కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని చెప్పారు. కొందరు కుటుంబాల్లో పిల్లలకు సరైన ఆహారం అందించలేని పరిస్థితులు కూడా ఉన్నాయని వడ్డెర మహిళలు కన్నీళ్లతో వివరించారు.*తక్షణమే న్యాయం చేయాలి*పొట్టకూటి కోసం బండరాళ్లు కొట్టి జీవించే తమకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే న్యాయం చేసి జీవనోపాధి కొనసాగించే అవకాశం కల్పించాలని వడ్డెర కులస్తులు కోరారు. తమకు రక్షణ కల్పించి, ఉపాధిని అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.“మాకు ఉపాధి లేకపోతే బతకడం కష్టం. మా కుటుంబాలను రోడ్డున పడేయొద్దు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి” అంటూ వారు వేడుకున్నారు. న్యాయం జరగకపోతే తమ కుటుంబాలతో కలిసి తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వడ్డెర కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News