Friday, April 24, 2026

సమాజంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ముందుండాలి* *ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)సమాజంలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు నిర్వహించిన ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆపదమిత్ర వాలంటీర్లు ఏవైనా అనుకోని విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. వాలంటీర్లు ఎంతోమంది జీవితాలను మార్చగలరని నమ్మకం ఉందన్నారు. ప్రకృతి విపత్తులే కాదూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు సహాయం చేయడంలోనూ వాలంటీర్లు ముందుండాలన్నారు. ఆపదమిత్ర వాలంటీర్లు సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో కాపాడటం, సహాయం చేయడం గురించి శిక్షణలో నేర్చుకున్న అంశాలను పదిమందికి నేర్పించాలన్నారు. ప్రజల్లో పాముకాటు, కుక్క కాటు గురించి కూడా చుట్టుపక్కల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత మండల పరిధిలో ఉన్న ఆపదమిత్ర వాలంటీర్ల వివరాలను స్థానిక అధికారులకు అందజేస్తామన్నారు. వాలంటీర్లు బాధ్యతతో సేవలందించాలన్నారు. ఆపదమిత్ర వాలంటీరుగా శిక్షణ పొందిన బాలికలు, మహిళలకు ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆపదమిత్ర వాలంటీర్లకు ప్రమాద బీమా చేయిస్తామన్నారు. ఆపదమిత్ర వాలంటీర్లు సమాజానికి మంచి చేశారనే పేరును తెచ్చుకోవాలన్నారు. 12 రోజుల పాటు హనుమకొండ, పరకాల డివిజన్లలో విజయవంతంగా నిర్వహించినందుకు అగ్నిమాపక, నెహ్రూ యువ కేంద్ర, ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు. *జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు* మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వాలంటీర్లకు 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వాలంటీర్లకు విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి, మెడికల్ పరంగా ఏ విధంగా సేవలందించాలనే అంశాలపై శిక్షణ లో అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 12 రోజుల పాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, వాలంటీర్లు ఏ విధంగా సేవలు అందించాలనే విషయాలను తెలుసుకున్నట్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆపదమిత్ర వాలంటీర్లకు సర్టిఫికెట్లు, ఐడి కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్, శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News