Monday, April 20, 2026

*సిపిఐలో చేరిన ప్రజాసంఘాల నాయకులు*

*నేటిసాక్షి, నల్లబెల్లి* మండలంలోని సామాజిక ప్రజాసంఘాల నాయకులు బట్టు సాంబయ్య, పరికి కోర్నేల్, మామిండ్ల పెద్ద అయిలయ్య, కన్కం సాల్మన్, కన్కం కోర్నేల్‌లు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చింతకింది కుమారస్వామి ఆధ్వర్యంలో సోమవారం సిపిఐలో చేరారు. ఈ సందర్భంగా కుమారస్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీగా స్వాతంత్ర్య ఉద్యమం నుండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల వరకు కీలక పాత్ర పోషించిందన్నారు. మహారాష్ట్రలో వర్లీ ఆదివాసుల పోరాటం, బెంగాల్‌లో తేభాగా ఉద్యమం, కేరళలో పున్నప్రా–వాయిలార్ పోరాటాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో నిజాం-భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటానికి సిపిఐ నాయకత్వం వహించిందని గుర్తుచేశారు. ఈ పోరాటాల వల్లే అణగారిన వర్గాలకు విముక్తి లభించిందని తెలిపారు.దేశంలో పుట్టిన అనేక రాజకీయ పార్టీలు పేదలకు, కింది కులాలకు రాజ్యాధికారం ఇవ్వకుండా ఉచితాలు, తాయిలాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అవకాశవాద రాజకీయాలు చేయకుండా పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు.సిపిఐలో చేరిన నాయకులు మాట్లాడుతూ ధన రాజకీయాలకు వ్యతిరేకంగా నిజాయితీ, నిస్వార్థ రాజకీయాల కోసం ఈ పార్టీలో చేరడం గర్వకారణమని తెలిపారు. వివిధ పార్టీలలో కొనసాగడం వల్ల ప్రజలకు మోసం జరుగుతోందని, ఇకపై పేదలు, సామాజిక వర్గాల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు.వ్యవసాయ కూలీలు, రైతులు, నిరుద్యోగులు, యువతకు సిపిఐ సరైన రాజకీయ వేదిక అని పేర్కొంటూ ఈ వర్గాలు పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News