*నేటిసాక్షి,నల్లబెల్లి* విద్యార్థులు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని దళిత విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయ ఆవరణలో తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 86 మంది విద్యార్థులు పోటీలో పాల్గొనగా సోమవారం విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ సందర్బంగా దళితరత్న అవార్డు గ్రహీత పరికరత్నం మాట్లాడుతూ… విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే పోటీ ప్రపంచంలో ముందుకు సాగవచ్చని చెప్పారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు సాధించడం ద్వారా కుటుంబం, గురువులకు గౌరవం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి విద్యార్థి లక్ష్యంతో శ్రమించాలని సూచించారు. పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న పి. హర్షితను, ద్వితీయ బహుమతి పొందిన మరో విద్యార్థినికీ మెమొంటో, శాలువాలతో సన్మానించారు. విజేతలు ఇద్దరూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, నల్లబెల్లికి చెందినవారు కావటం గమనార్హం. ఈ కార్యక్రమంలో టి. శ్రీకాంత్, డి. సంతోష్, కందిశెట్టి శ్రీనివాస్, చిరంజీవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





