నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)వర్షాకాలం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ (సీజనల్ వ్యాధులు) ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వర్షాకాలం నేపధ్యంలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల పై పీపీటీ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మాపింగ్ చేసి, నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాలలో డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్ల ఆయిల్ బాల్, గంబుషియా చేపలు వేయాలన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై గ్రామ సభలలో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకొవాలని, ముఖ్యంగా పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి అనుమానితుల నుండి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ రాపిడ్ టెస్టులు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా కూలిపోయే స్థితిలో ఉన్న పాడైపోయిన భవనాలు, పాతబడిన భవనాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, డిఆర్డీఓ కౌసల్య దేవి , జెడ్పి సీఈఓ రామిరెడ్డి,జిల్లా మలేరియా అధికారి రజిని, డిబిసిడిఓ పుష్పలత, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




