నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె శివారులోని మద్ది మేడారం జాతర ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం మద్ది మేడారం ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ ఎరుకల లలిత అధ్యక్షతన నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా తొలిసారి మద్ది మేడారం జాతరకు వచ్చిన కలెక్టర్‌ను శాలువాలతో సత్కరించేందుకు నాగరాజుపల్లె, మామిండ్ల వీరయ్యపల్లె సర్పంచులు చేసిన ప్రయత్నాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించారు.శాలువాల సన్మానాలకు చేసే ఖర్చును చలికాలంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడానికి వినియోగించాలని సూచించారు.ఈ మాటలు సమావేశానికి హాజరైన వారిలో ప్రేరణ కలిగించాయి.జాతరను ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హితంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.బీటీ రోడ్డు నుంచి అమ్మవారి గద్దెల వరకు వెళ్లే, తిరుగు ప్రయాణ రహదారులను బీటీ రోడ్లుగా మార్చాలని ప్రజలు కోరగా సానుకూలంగా స్పందించారు.రెండు రహదారులకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వెలిగించాలని తెలిపారు.జాతర ప్రాంగణంలో శాశ్వత సానిటేషన్ నిర్మాణాలు, విశ్రాంతి గదులు, అదనపు తాగునీటి సౌకర్యాల కోసం రెండు చేతిపంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.ఆలయ మరమ్మతులు, వసతుల మెరుగుదలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డాక్టర్ శుభ నివాస్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ రెడ్డి, మామిండ్ల వీరయ్య పల్లె సర్పంచ్ ఏడాకుల సరోజన, రెండు గ్రామాల ఉపసర్పంచ్ బైరి శోభన , కదురు నాగరాజు నాగరాజు పల్లె ,మామిళ్ల వీరయ్యపల్లె, కన్నారావుపేట గ్రామాల కార్యదర్శులు విష్ణు ,సుధాకర్, సంతోష్ లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్ ,ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





