Monday, March 9, 2026

*సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి*——* సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి* మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు అవగాహన—–

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు సైబర్ భద్రతపై సూచనలు చేశారు.*సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలి*ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ మహిళలు, ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ స్టాకింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడం, వేధించడం, బెదిరించడం వంటి చర్యలు సైబర్ నేరాల పరిధిలోకి వస్తాయని వివరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.*ఫేక్ ప్రొఫైల్‌లతో మోసాలు*ఇతరుల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి డబ్బులు అడగడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. విదేశాల్లో ఉద్యోగం, గిఫ్ట్ పంపుతున్నామని చెప్పి డబ్బులు అడిగే మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులకు వివరించారు.*ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలపై జాగ్రత్త*ఫిషింగ్ లింకులు పంపించి డేటా దొంగిలించడం, ఓటీపీలు తీసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం వంటి సైబర్ మోసాల గురించి కూడా వివరించారు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, ప్రైవసీ సెట్టింగ్స్‌ను సరిచేసుకోవడం, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.*మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు*సైబర్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని, అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపారు. బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందిస్తే మోసపోయిన డబ్బులను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.*పోస్టర్ ప్రదర్శన, ప్రతిజ్ఞ*కార్యక్రమం అనంతరం విద్యార్థినులు అడిగిన వివిధ సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ విద్యార్థినులతో సైబర్ క్రైమ్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు పోస్టర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సైబర్ క్రైమ్ ఎస్‌.ఐలు కృష్ణ, దినేష్, టౌన్ ఎస్‌.ఐ సుప్రియా, కళాశాల సిబ్బంది, కళా బృంద సభ్యులు మరియు సుమారు 250 మంది నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News