నేటిసాక్షి/ములుగు ప్రతినిధి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే సంకల్పంతో బిఆర్ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక సర్పంచ్ గంట ప్రవళిక గున్ను సహకారంతో బుధవారం 26వ విడత ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి తాడ్వాయి మండలంతో పాటు పరిసర మారుమూల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడం విశేషం.ఈ సందర్భంగా నిపుణులైన వైద్యులు ప్రజలకు కంటి సంబంధిత పలు పరీక్షలు నిర్వహించారు.. కంటి చూపు తగ్గడం, కంటి అలర్జీలు, ముత్యబిందు వంటి సమస్యలను గుర్తించి అవసరమైన వారికి ఆపరేషన్ కొరకు ప్రత్యేక బస్సులో హైదరాబాదులోని శంకర కంటి ఆసుపత్రికి పంపడం విశేషం. ఈ శిబిరం ద్వారా పేద గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగిందని స్థానికులు తెలిపారు.గ్రామాల్లో నివసించే ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భూక్య జంపన్న స్వచ్ఛందంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ములుగు జిల్లా వ్యాప్తంగా పరిసర ప్రాంతాల్లో వరుసగా 26 విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం ఆయన సేవా భావానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఈ సందర్భంగా భూక్య జంపన్న మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఖరీదైన చికిత్సలు చేయించుకోలేని పరిస్థితుల్లో ఉచితంగా పరీక్షలు, మందులు అందించడం ఎంతో అవసరమని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.





