నేటి సాక్షి గజ్వేల్ : విద్య అందించాల్సిన ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు ఆర్భాట కార్యక్రమాల పేరుతో విద్యార్థుల జేబులపై దండెత్తుతున్నాయన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గజ్వేల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం ఇందుకు నిదర్శనంగా నిలిచింది.సుమారు 800 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో వార్షికోత్సవ ఖర్చుల పేరిట ప్రతి విద్యార్థి నుంచి రూ.700 చొప్పున వసూలు చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలా వసూలైన డబ్బుతో పట్టణంలోని ఒక పెద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. డీజే సౌండ్ సిస్టమ్స్, రంగురంగుల అలంకరణలు, భారీ వేదికలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించడం గమనార్హం.అయితే ఈ ఖర్చులను పాఠశాల యాజమాన్యం భరిస్తుందని భావించిన తల్లిదండ్రులకు తర్వాత అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. విద్యార్థుల నుంచే వసూలు చేసిన డబ్బుతోనే ఈ ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం.ఇప్పటికే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు మరోవైపు ఫ్రెషర్స్ డే, వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యాసంస్థలు విద్యాబోధనపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రచారం, ప్రతిష్ఠ కోసం విద్యార్థులనే ‘నిధుల వనరులుగా’ మార్చుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు కార్యక్రమాల సమయంలో విద్యార్థులనే వివిధ పనులకు ఉపయోగించుకోవడం కూడా జరుగుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారితోనే పనులు చేయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి ఘటనలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి మౌనం పాటించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాంతంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇప్పటికైనా అధికారులు నిద్రలేచి ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విద్యాసంస్థల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీకి ఎక్కడ బ్రేక్ పడుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.




