నేటి సాక్షి గజ్వేల్ :—-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి గతంలో భారీగా నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నీళ్లు, నిధులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించింది.ఈ క్రమంలోనే ఆధునిక సదుపాయాలతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మహతి ఆడిటోరియం ప్రస్తుతం వినియోగంలో లేకపోవడం స్థానిక ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. 2015లో ఈ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2019లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత కొన్నేళ్లు వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించగా, గత రెండు సంవత్సరాలుగా మాత్రం ఆడిటోరియం తలుపులు తెరుచుకోకపోవడంతో మూసివేతలోనే ఉంది.దీంతో లోపల ఏర్పాటు చేసిన ఫర్నిచర్, ఎయిర్ కండిషనింగ్ పరికరాలు, విద్యుత్ సదుపాయాలు ఉపయోగం లేకపోవడంతో పాడవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ఆడిటోరియాన్ని వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలకు అద్దెకు ఇచ్చి కొంతమేర ఆదాయం కూడా పొందేవారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.గజ్వేల్ పట్టణ అభివృద్ధి కోసం సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, సమీకృత కూరగాయల మార్కెట్, పట్టణం చుట్టూ సుమారు 23 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, చెరువుల సుందరీకరణ, నూతన మున్సిపల్ కార్యాలయం, సంగాపూర్ వద్ద హెర్బల్ పార్క్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో కొన్నింటి ద్వారా ప్రజలకు ఉపయోగం కలుగుతున్నప్పటికీ, మహతి ఆడిటోరియం మాత్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఈ ఆడిటోరియాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గజ్వేల్ ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు అద్దెకు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుందని వారు సూచిస్తున్నారు. లేకపోతే కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనం కూడా గతంలో నిర్మించిన కొన్ని భవనాల మాదిరిగా నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





