నేటి సాక్షి, పరిగి (సురేష్ మోత్కుర్ ) : రాజకీయం అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన సేవ అని పరిగి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్ మరోసారి నిరూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ‘నిజమైన ప్రజా సేవకుడు’ అనిపించుకుంటున్నారు. తన వార్డు పరిధిలోని ఒక నిరుపేద కుటుంబంలో జరిగిన వివాహానికి ఆయన స్వయంగా ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. వార్డులోని హషమ్ ఖురేషి సాదక్ కుమార్తె వివాహానికి కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్ రూ. 21,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. తను సొంతంగా రూపొందించుకున్న ‘నికాహ్ ముబారక్ యోజన’ ద్వారా మత, వర్గ భేదాలు లేకుండా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వివాహ వేడుకకు హాజరైన ఆయన, నూతన వధూవరులను ఆశీర్వదించి ఈ చెక్కును అందజేశారు. ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాన్ని జరిపించడంలో ఇబ్బంది పడకూడదన్నదే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. “నేను మాటల మనిషిని కాదు.. చేతల మనిషిని. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కౌన్సిలర్ శ్రీనివాస్ చూపిస్తున్న ఈ చొరవపై వార్డు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్నప్పుడు స్పందిస్తూ, సొంత నిధులతో సహాయం చేయడం ఒక మంచి పరిణామమని స్థానికులు కొనియాడుతున్నారు. ఏ సమస్య వచ్చినా ముందుండే నాయకుడిగా శ్రీనివాస్ పరిగి మున్సిపాలిటీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.





