నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 20 పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. గ్రామంలోని శ్రీ భీమరాయ స్వామి ఆలయం పక్కన ఉన్న డ్రైనేజీలో ఆర్ఎంపీ వైద్యులు వాడిన సిరంజీలు, ఇతర వైద్య వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడవేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ ప్రమాదకర వ్యర్థాల వల్ల పరిసరాల్లో దుర్వాసన వ్యాపించడంతో పాటు, సంక్రమణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ప్రాంతంలో సంచరించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వైద్య వ్యర్థాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీని శుభ్రపరచి పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యర్థాలను పారవేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.





