Tuesday, April 28, 2026

*కేంద్రాలు తెరిచినా కొనుగోళ్లు శూన్యం** రైస్‌ మిల్లుల కేటాయింపు జాప్యంతో నిలిచిన కొనుగోళ్లు* తక్షణ చర్యలకు పత్తిపాక వెంకటేష్ డిమాండ్*

నేటి సాక్షి, ఎండపల్లి:* వెల్గటూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఇరవై రోజులుగా వరి కోతలు ప్రారంభమై, రైతులు కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా ఇప్పటివరకు తూకం ప్రక్రియ మొదలు కాకపోవడంతో పేరుకే కేంద్రాలు తెరిచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో గుబులు పెరుగుతోంది. ఏఎంసీ మాజీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ.. రైతులు శ్రమించి పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లుల కేటాయింపులు చేపట్టాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌లను కోరారు. కేంద్రాలు ప్రారంభించడం మాత్రమే కాకుండా తక్షణమే తూకం ప్రక్రియ చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు అకాల మబ్బులు కమ్ముకోవడంతో కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం దెబ్బతింటుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోందన్నారు. నేరుగా రైస్‌మిల్లులకు కేటాయింపులు చేస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని సూచించారు. ధాన్యం తరలింపులో ఆలస్యం జరిగి, అనంతరం నాణ్యత పేరుతో కోతలు విధిస్తే రైతులతో పాటు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సంఘాలు కూడా నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి కోతలు, ఇబ్బందికర నిబంధనలు లేకుండా ధాన్యాన్ని వెంటనే తరలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటివరకు ఒక్క బస్తా ధాన్యం కూడా కేంద్రాల నుంచి బయటకు వెళ్లకపోవడం బాధాకరమన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను ప్రభుత్వం ఆదుకుని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు భరోసా కల్పించాలని పత్తిపాక వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News