నేటి సాక్షి, ఎండపల్లి:* వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ చిన్నారుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించేందుకు కొత్తపేట గ్రామంలో సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి (జేఎంఆర్ ట్రస్ట్) ఆధ్వర్యంలో కరాటే (కుంగ్ ఫు) శిక్షణ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. 8 సంవత్సరాలు పైబడిన బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం ద్వారా ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మే 6 నుంచి జూన్ 15 వరకు కొనసాగనున్న ఈ శిబిరంలో సీనియర్ కరాటే మాస్టారు రాజమల్లయ్య ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల చిన్నారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ జీరెడ్డి మహేందర్ రెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు ఆత్మరక్షణ విద్య అవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి శిక్షణలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.





