క నేటి సాక్షి గజ్వేల్//ఆర్టీసీని కనుమరుగు చేసి ప్రైవేటుపరం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు భారీగా గ్రేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా,, రాష్ట్ర కోశాధికారి యాదన్న నాయకులు జక్కుల నర్సిములు, డిపో జేఏసీ కన్వీనర్ రాజయ్య పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విజయవంతంగా అమలు చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్నారని తెలిపారు. అయితే ఈ పథకం అమలుతో డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని, రద్దీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కారణంగా అనుకోకుండా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని వారు మండిపడ్డారు.అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన విలువైన భూములు, ఆస్తులు, వర్క్‌షాపులు, డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలిఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం సమ్మె నిషేధం పేరుతో కార్మికులను బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.ప్రభుత్వ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడబోరని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. తమ హక్కుల కోసం, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు పోరాటం తప్పదని ప్రకటించారు.22న ఆర్టీసీ బంద్‌కు ప్రజలు సహకరించాలిఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని హెచ్చరిస్తూ ఈ నెల 22న చేపట్టనున్న ఆర్టీసీ బందును విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చినప్పుడే ఆర్టీసీ బస్సు చక్రాలు తిరుగుతాయని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.ప్రజలు కూడా ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలబడి బందుకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు నర్సింలు అంబాదాస్, పద్మ, కరీముద్దీన్, సిద్ధ రాములు, మహేష్, గఫూర్, శ్యామ్ సుందర్, శంకర్ ల తో పాటు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.





