Friday, April 17, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించాలి.అదనపు డిజిపి స్వాతి లక్రా.

నేటి సాక్షి వికారాబాద్ :99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీసాయి దంత వైద్య కళాశాలలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడంపై లారీ, ఆటో డ్రైవర్ లు, అంగన్ వాడి, ఆశా వర్కర్లు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు డీజీపీ స్వాతి లక్రా, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహమేహర జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ స్వాతి లక్రా మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా అదేవిధంగా నిబంధనలు పాటించకుండా డ్రైవింగ్ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆమె అన్నారు. ఎదుటివారి తప్పిదాల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలను వేగంగా నడపకూడదని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్నసామాజికపర అంశాలను తెలుసుకొని అందరికీ చేర వేసే విధంగా యువత బాధ్యత తీసుకొని అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ… రోడ్డు ప్రయాణాల్లో గమ్యం ముఖ్యం కాదని విలువైన జీవితం ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 2025 సంవత్సరానికి లక్ష 50 వేల మంది మరణించారని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యజమాని మరణించినట్లయితే ఆ కుటుంబం ఎంతగానో నష్టపోతుందని కలెక్టర్ తెలిపారు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు అరికట్టవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రోడ్డు భద్రత కమిటీలను వేయడం జరిగిందని, ప్రతినెల రోడ్డు భద్రతపై సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పాలనపరంగా తమ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు నాశనం కాకుండా మంచి సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరమని అందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ…రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అన్నారు. సంపాదించే వ్యక్తి చనిపోతే కుటుంబం పూర్తిగా ఇబ్బందికి గురవుతుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా వాహనం నడిపే సమయంలో స్పష్టమైన కంటి చూపు ఉండటం అత్యంత అవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని అందుకు ఉచిత శిబిరాలను ఏర్పాటుచేసి డ్రైవర్ లందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలను ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.ముందుగా దంత వైద్య కళాశాల విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన శాస్త్రీయ నృత్యాలు, డ్రగ్స్ తీసుకుంటే కలిగే అనర్ధాలపై చేసిన నాటక ప్రదర్శనలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై తీసిన లఘు చిత్రం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో సేవలందించిన 108 సిబ్బంది పవన్ కుమార్, వైద్య రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న డాక్టర్ సౌమ్య, డాక్టర్ రోహిత్, పోలీస్ కళాజాత బృందం అశోక్ లను అతిధులు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్, వైస్ ప్రిన్సిపాల్ సంపత్ రెడ్డి, జిల్లా వివిధ శాఖల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News