*నేటి సాక్షి, ఎండపల్లి:* తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించాలని ఎండపల్లి మండల బీజేపీ నాయకులు మామిడిపల్లి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నిలువ నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, తగినంత టార్పాలిన్ కవర్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా రైతులు, హమాలీల కోసం చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందించేలా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ధాన్యం తూకం ప్రక్రియను ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువసేపు వేచి చూడకుండా టోకెన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వడదెబ్బకు గురైన రైతులకు తక్షణ ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మామిడిపల్లి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.





