నేటి సాక్షి,కొమరం భీమ్ ఆసిఫాబాద్, డిసెంబర్ 25:చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ హెచ్చరించారు. నైలాన్ లేదా సింథటిక్ దారంతో గాజుపొడి పూతతో తయారయ్యే చైనీస్ మాంజా అత్యంత ప్రాణాంతకమని ఆమె తెలిపారు.ద్విచక్ర వాహనాలపై వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ మాంజా దారం మెడకు లేదా ముఖానికి తగిలితే తీవ్ర గాయాలు, రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందన్నారు. దారం చాలా సన్నగా ఉండటంతో గాలిలో వేలాడుతున్నట్టు కనిపించకపోవడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.వాహనదారులు పూర్తి ముఖాన్ని కవర్ చేసే విండ్‌షీల్డ్ ఉన్న హెల్మెట్ ధరించాలని, ఫ్లైఓవర్లు మరియు గాలిపటాలు ఎక్కువగా ఎగిరే ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వేగం తగ్గించాలని సూచించారు.చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం పర్యావరణ పరిరక్షణ చట్టం మరియు భారతీయ న్యాయసంహిత కింద నేరమని, దీనికి భారీ జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. చైనీస్ మాంజా అమ్మకం లేదా రవాణా సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు తెలియజేయాలని ప్రజలను కోరారు.





