Monday, March 16, 2026

తుమ్మలగుంటలో శరవేగంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు– ఏర్పాట్లుపై సమీక్షించిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి – స్వాగత తోరణాలు, విద్యుత్తు దీపాల ఏర్పాట్లపై సూచనలు– ప్రధాన ఆలయం, వైకుంఠ ద్వార పుష్పాలంకరణలపై చర్చ– పార్కింగ్‌ ఏర్పాట్లుపై గ్రామస్తులు, సిబ్బందితో పరిశీలన

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్‌ 30వ తేదీన నిర్వహించే వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 3.30 గంటల నుంచే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం ముఖద్వారంతో పాటు వైకుంఠ ద్వారాన్ని సువాసనలు వెదజల్లే పరిమళ భరిత పుష్పాలు, పత్రాలSతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరణ చేయాలన్నారు. ప్రతి ఏటా తెచ్చినట్టుగానే దేశ, విదేశాల నుంచి పువ్వులు తీసుకురావాలని సూచించారు. తిరుపతి నగరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులు అందరికీ వీలైనంత త్వరగా స్వామి దర్శనం కల్పించేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని పనిచేయాలన్నారు. ఆలయం ముందు సర్వదర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు ఆగకుండా ముందుకు కదులుతూ వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్‌ల నుంచి లోనికి అనుమతించి సామాన్య భక్తులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. అలాగే గోవిందమాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయం లేనప్పటికీ త్వరగా దర్శనం కలిగించేలా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా పొరబాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆలయం వద్ద శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. తుమ్మలగుంట గ్రామ శివార్లలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేసినందున వాహనాలను అక్కడే పార్క్‌ చేసి ఆలయం వద్దకు భక్తులు నడచి రావాలని, ఈ మేరకు గ్రామస్తులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. *పటిష్టంగా క్యూలైన్లు ఏర్పాటు*ఆలయం ముందు నుంచి లోపల వరకు ఏర్పాటు చేసే క్యూలైన్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల మద్యన తోపులాటలు, తొక్కిసలాటలకు తావు లేకుండా నెమ్మది కదిలేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠ ద్వారంలో కూడా ఎక్కువ సమయం గడపకుండా భక్తులను త్వరగా పంపించేందుకు నిరంతరాయంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠ ద్వారంలో పువ్వులను భక్తులు తుంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయం బయట తీర్థ ప్రసాదాలు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచనలు చేశారు. *నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ..*వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ౖక్యూలైన్లతో పాటు దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. గర్బాలయంలో ఎక్కువ సమయం, అర్చన, హారతులు పెట్టి సామాన్య భక్తులకు దర్శనం ఆలస్యం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవో సుబ్బరామిరెడ్డికి సూచించారు. గతంలో జరిగిన ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలన్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్షలో ఆలయ అధికారులు, సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News