Tuesday, March 10, 2026

ఫామ్‌హౌస్ పాలనతో ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్… మత రాజకీయాలతో బీజేపీ : సంక్షేమ అమలులో కాంగ్రెస్ దూకుడుగజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

నేటి సాక్షి గజ్వేల్ :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించే విధంగా త్వరలోనే పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఐదో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉడెం సారిక శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను నమ్మి మూడుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలను ఆయన పూర్తిగా మోసం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితమై నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు.ప్రజా సమస్యలను విస్మరించిన టీఆర్‌ఎస్ నేతలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, స్థానిక ప్రజలు తమ సమస్యలపై టీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు అధికార ఆశతో మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మతాల ప్రజలు ఐక్యతతో జీవిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న పార్టీ అని నర్సారెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలు, మహిళలు, రైతులు, కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. రాబోయే గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సారిక శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్ ఉస్మాన్, కన్నా యాదవ్, ఉస్మాన్, బద్రి, నాగరాజు, జావిద్, యూసుఫ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News