నేటి సాక్షి మహబూబాబా ద్ ఫిబ్రవరి 6 నరసింహుల పేట మండలం | కొమ్ములవంచ గ్రామంమండలంలోని కొమ్ములవంచ గ్రామంలో 2023–2024, 2024–2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పాత చెరువు, కొత్త చెరువులను గ్రామపంచాయతీ పాలకమండలి సమక్షంలో వేలం వేయగా, వేలంలో పాల్గొన్న పాటదారులు నిర్ణయించిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించారు. అయితే, చెల్లించిన సొమ్మును గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయకుండా, పంచాయతీ కార్యదర్శి మరియు మాజీ సర్పంచి చేతి రసీదులు మాత్రమే ఇచ్చి డబ్బులు వసూలు చేసి, లెక్కలు చూపకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయం బయటకు రావడంతో, స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి పాటదారులకు నోటీసులు జారీ కావడం తీవ్ర కలకలం రేపింది. డబ్బులు ఇప్పటికే చెల్లించినప్పటికీ మళ్లీ నోటీసులు రావడంతో తమ పరువుకు భంగం కలిగిందని పాటదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని తమ వద్ద ఉన్న గ్రామపంచాయతీ రసీదులతో పాటు సర్పంచి, కార్యదర్శులు ఇచ్చిన చేతి రసీదులను అధికారులకు చూపించారు.ఈ సంఘటనతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గ్రామపంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని ఎస్టీవో ఖాతాలో జమ చేయకుండా సర్పంచి, కార్యదర్శులు ఖర్చు చేయవచ్చా? చేతి రసీదులు ఇవ్వడం వెనుక అసలు అంతర్యం ఏమిటి? ఇది ఒక్క కొమ్ములవంచ గ్రామపంచాయతీకి మాత్రమే పరిమితమా, లేక మండలంలోని ఇతర గ్రామపంచాయతీల్లోనూ ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు మండల ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి.సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టి, ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? లేక మామూలుగానే వదిలేస్తారా? అన్నదానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.





