నేటి సాక్షి, ధర్మారం : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే శుక్రవారం కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా నందిమేడారం గ్రామంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన, అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు వారి విద్యా అర్హతల గురించి, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్య కోర్సులు, ఉద్యోగం, స్వయం ఉపాధి, వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, ఎన్ని గంటలు పని చేశారో, ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ గణాంక శాఖ సిబ్బంది పెద్ది వీరేశం, నందిమేడారం సర్పంచ్ వీర్ పాల్, ఉప సర్పంచ్ రవి కుమార్, పంచాయతీ సెక్రటరీ మౌనిక, ఆశా వర్కర్లు వకులాదేవి, రజిత, కారోబార్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.





