నేటి సాక్షి నారాయణపేట ఏప్రిల్ 18, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్)ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం ’ కార్యక్రమం కింద రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు, వాహనదారులకు సందేశం అందించారు.ఈ ర్యాలీలో జోగులాంబ జోన్-07 డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ , జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్ రోడ్డు, పాత బస్టాండ్, సెంటర్ చౌక్ మీదుగా శ్రీ గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తేనే ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ తమ కుటుంబ సభ్యులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… ప్రజలు ఇంటి నుండి వెళ్లి మళ్లీ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి ముందుకు రావాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.అలాగే జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ… నారాయణపేట జిల్లాలో ప్రతి సంవత్సరం 100కు పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఈ సంఖ్యను తగ్గించాలంటే ప్రతి ఒక్కరు డిఫెన్స్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రమాదాల నివారణలో కీలకమని తెలిపారు. కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరంతర అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు జీరో ఎన్‌ఫోర్స్‌మెంట్ (వితౌట్ చాలన్)తో కేవలం అవగాహన కార్యక్రమం మాత్రమే నిర్వహిస్తున్నామని, వాహనదారులు స్వచ్ఛందంగా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, సైదులు, భగవంత్ రెడ్డి, ఆర్.ఐ. విజయ్ భాస్కర్, ఆర్టీవో నెంబర్ పోషల్ రాజేష్, కౌన్సిలర్ మహేష్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, సతీష్ రెడ్డి , వెంకటేష్ గౌడ్, నరేష్, బాలరాజు, పోలీసు సిబ్బంది, యువకులు,విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





