నేటి సాక్షి గజ్వేల్ : ----
పేద పద్మశాలీలు, చేనేత కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గజ్వేల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన సంఘ కార్యవర్గ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ, చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల ఆర్థిక పురోభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చేనేత మిత్ర, నేతన్న భరోసా, నేతన్న పొదుపు, బీమా వంటి సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రభుత్వం ముడి సరుకులు, నూలు, రసాయనాలను సబ్సిడీపై అందిస్తున్న విషయాన్ని ప్రతి చేనేత కార్మికుడికి తెలియజేసి వాటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతామని వివరించారు.
రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కార్మికుడికి వర్తింపజేసేందుకు సంఘం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని రాజేశం తెలిపారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సమిష్టి నిర్ణయాలతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, చేనేత కార్మికుల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
అంతకుముందు ఎన్నికల అధికారి గౌతమ్ కుమార్ నూతన కార్యవర్గ సభ్యులకు గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంఘ ఉపాధ్యక్షుడు వల్లందాసు సత్యనారాయణ, కార్యదర్శి ఎలగందుల రామచంద్రం, డైరెక్టర్లు జిల్లా భాగ్యలక్ష్మి, అమృతమ్మ, దొంతుల ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు బింగి పురుషోత్తం, గాడిపల్లి అనూప్, రాజారాం, నేత నాగరాజు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తాం గజ్వేల్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా స్వర్గం రాజేశం
Quick Summary:
చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం

