నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా పోలీసు అధికారి శ్రీమతి స్నేహ మెహ్రా, తాండూర్ రూరల్ సర్కిల్ కార్యాలయం తాండూర్ డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ముందుగా కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, కార్యాలయాల పరిశుభ్రత మరియు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం సర్కిల్ సబ్-డివిజన్ కార్యాలయాలలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్రాలు, స్టేషన్ వారీ రిజిస్టర్లు ఇతర అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తనిఖీ సందర్భంగా సిబ్బంది టర్నౌట్‌ను కూడా పరిశీలించిన ఎస్పీ , అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో, చక్కటి టర్నౌట్‌తో విధులు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ ప్రజాసేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని అందరికీ సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న వి.పి.ఓ (విలేజ్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థను మరింత ప్రభావవంతంగా రూపొందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. గ్రామ స్థాయిలో సమాచార సేకరణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం పోలీసు-ప్రజల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో వి.పి.ఓ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా “సురక్ష మిత్ర” కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.
Telangana
తాండూర్ డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర.
Quick Summary:
తాండూర్ డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ

