నేటి సాక్షి నారాయణపేట జూలై 6( రిపోర్టర్ ఇమామ్ సాబ్),
నారాయణపేట: తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోస్గి పోలీసులు, నారాయణపేట సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం వేగంగా అరెస్టు చేసి, దొంగిలించిన నగదులో రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, తెలిపారు.
జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన నేపథ్యంలో, కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.54/2026, సెక్షన్ 331(3), 305 బీఎన్‌ఎస్ కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో వేగంగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకునీ పత్రిక సమావేశంలో నిందితుడి వివరాలు ఎస్పీ వెల్లడించారు.
నిందితుడు ఏదుల బాబు, తండ్రి చెన్నయ్య, వయస్సు 42 సంవత్సరాలు, లింగయ్యపల్లి గ్రామం, గండీడ్ మండలం, వృత్తిరీత్యా ప్రైవేట్ బస్సు డ్రైవర్ అని తెలిపారు.
(06.07.2026) కోస్గి లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గమనించిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి ఇంటి నుంచి రూ.6,88,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం దొంగిలించబడిన నగదు రూ.10,00,000 అని తెలిపారు.
నిందితుడు 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 18 ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. కోస్గి, కుల్కచర్ల, మరికల్, మహమ్మదాబాద్, మద్దూర్, నారాయణపేట, వికారాబాద్, డోమా, మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి.
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, చెడు అలవాట్ల కారణంగా నిందితుడు పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, ఇనుప పరికరాలతో తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగిలించేవాడని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఆ డబ్బుతో అప్పులు తీర్చడం, కుటుంబ ఖర్చులు నిర్వహించడం, చెడు అలవాట్లకు ఖర్చు చేసేవాడని వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, మాట్లాడుతూ... ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలకు నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన కోస్గి సీఐ ఎ. సైదులు, కోస్గి ఎస్‌ఐ జి. పురుషోత్తం, సీసీఎస్ ఎస్‌ఐ విజయభాస్కర్, కోస్గి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీసీఎస్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
పత్రికా సమావేశంలో డిఎస్పి లు నల్లపు లింగయ్య, మహేష్ లు ఉన్నారు.
Telangana
తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ పేటజిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్,.......
Quick Summary:
పేటజిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్,.......