Telangana
*ఉప సర్పంచ్‌లకు సముచిత స్థానం కల్పించాలి* * మంత్రి అడ్లూరికి వినతిపత్రం అందించిన పోరం నేతలు * మండల అధ్యక్షుడిగా సింహరాజు క్రాంతి ఎన్నిక
Quick Summary:
*ఉప సర్పంచ్‌లకు సముచిత స్థానం కల్పించాలి*
*నేటి సాక్షి, ఎండపల్లి:* మండల ఉపసర్పంచ్‌లకు సముచిత స్థానం కల్పించి, వారి హక్కులు, అధికారాలను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపసర్పంచ్‌ల పోరం రాష్ట్ర కార్యదర్శి మేరుగు జంపన్న (జానీ) పేర్కొన్నారు. బుధవారం ఎండపల్లిలో నిర్వహించిన మండల ఉపసర్పంచ్‌ల పోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపసర్పంచ్‌ల సమస్యలు, హక్కుల పరిరక్షణ, స్థానిక సంస్థల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేసే అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పోరం జిల్లా అధ్యక్షుడు ముత్యాల స్వామి, జిల్లా కన్వీనర్ గురిజాల బుచ్చిరెడ్డి పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కొత్తపేటకు చెందిన సింహరాజు క్రాంతి, ఉపాధ్యక్షుడిగా మారేడుపల్లికి చెందిన చీమల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెర్లపల్లికి చెందిన అల్గం తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా కొండాపూర్‌కు చెందిన తనుగుల విజయ్ ఎన్నికయ్యారు. అనంతరం ఉప సర్పంచ్‌ల పోరం ప్రతినిధి బృందం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది. ఉప సర్పంచ్‌లకు ప్రస్తుతం ఉన్న చెక్కు పవర్‌ను యథావిధిగా కొనసాగించాలని, నెలకు రూ.5 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం కల్పించాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పేర్లు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఉపసర్పంచ్‌ల సమస్యలను పరిశీలించి, రానున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.