Telangana
*యాప్ ఆధారంగానే యూరియా పంపిణీ* * ప్రారంభమైన బుకింగ్ యాప్ సేవలు * సాగు విస్తీర్ణం ప్రకారం విడతల వారీగా పంపిణీ * బుకింగ్ పై అవగాహన కల్పించిన అధికారులు
Quick Summary:
*యాప్ ఆధారంగానే యూరియా పంపిణీ*
*నేటి సాక్షి, ఎండపల్లి:* జిల్లాలో రైతులకు యూరియా ఎరువును సకాలంలో, పారదర్శకంగా అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ సేవలను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు ముందస్తుగా యూరియాను బుక్ చేసుకుని తమకు కేటాయించిన ఎరువుల విక్రయ కేంద్రాల్లో సులభంగా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1 లక్షా 19 వేల 743 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతుల సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని దశలవారీగా యూరియా పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక ఎకరం వరకు సాగు చేసే రైతులకు ఒక విడత, ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు సాగు చేసే రైతులకు రెండు విడతలు, మూడు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి మూడు విడతలు, ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు నాలుగు విడతల్లో యూరియా అందజేయనున్నట్లు వివరించారు. ప్రతి విడతకు 15 రోజుల వ్యవధి ఉంటుందని చెప్పారు. యూరియా బుకింగ్ కోసం రైతులు తమ మొబైల్ ఫోన్‌లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పీపీబీ, ఆర్‌ఓఎఫ్‌ఆర్ లేదా ఎన్‌డీఎస్ వివరాలతో లాగిన్ కావాలని సూచించారు. అనంతరం సాగు వివరాలను నమోదు చేసి, తమకు కేటాయించిన యూరియా సంచుల మేరకు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ పూర్తయిన తర్వాత జారీ అయ్యే బుకింగ్ ఐడీ ఆధారంగా సంబంధిత ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను పొందవచ్చని పేర్కొన్నారు. యాప్ వినియోగం, బుకింగ్ విధానంపై రైతులకు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైన మేరకే యూరియాను బుక్ చేసుకోవాలని, బ్లాక్ మార్కెట్ లేదా అనధికార కొనుగోళ్లకు పాల్పడవద్దని సూచించారు. యాప్ వినియోగంపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 123 7157ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.