నేటి సాక్షి గజ్వేల్ : ----
భూమిని నమ్మి, ఆకాశాన్ని నమ్మి, చివరికి విత్తనాల విక్రయదారులను విశ్వసించి పంటలు సాగు చేసే రైతుల నమ్మకంతో కొందరు వ్యాపారులు చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు గజ్వేల్ నియోజకవర్గంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఓ రైతుకు నకిలీ, కాలం చెల్లిన పత్తి విత్తనాలను విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
అందిన సమాచారం ప్రకారం, గజ్వేల్ పరిసర ప్రాంతానికి చెందిన ఓ రైతు పత్తి సాగు కోసం పట్టణంలోని ఓ విత్తనాల దుకాణాన్ని ఆశ్రయించాడు. విక్రయదారుడు ఇచ్చిన విత్తనాలపై పూర్తి నమ్మకంతో వాటిని కొనుగోలు చేసి తన పొలంలో విత్తాడు. అనంతరం వాటి నాణ్యతపై అనుమానం రావడంతో పరిశీలించగా అవి కాలం చెల్లినవని, నకిలీవని రైతు గుర్తించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు సంబంధిత దుకాణదారుడిని నిలదీశాడు.
విషయం బయటకు రావడంతో మధ్యవర్తులు రంగప్రవేశం చేసి రైతుకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మరో సంస్థకు చెందిన పత్తి విత్తనాలను అందజేస్తామని హామీ ఇచ్చి వ్యవహారాన్ని అక్కడితో ముగించే ప్రయత్నం జరిగినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. అయితే రైతుకు జరిగిన నష్టానికి బాధ్యులెవరు? ఇప్పటికే విత్తిన భూమికి కలిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వ్యవసాయం అనేది రైతుకు జీవనాధారం మాత్రమే కాదు, దేశ ప్రజల ఆహార భద్రతకు మూలస్తంభం. అలాంటి రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఏటా వినిపిస్తున్నప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
ముఖ్యంగా ఖరీఫ్ సాగులో గజ్వేల్ నియోజకవర్గంలో పత్తి, మొక్కజొన్న పంటలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభానికి ముందే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తుంటారు. రైతుల ఈ అవసరాన్ని అవకాశంగా మార్చుకుని కొందరు వ్యాపారులు నకిలీ వ్యాపారానికి పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తనిఖీలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, మరికొందరి ఉదాసీన వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ నకిలీ విత్తనాలు భూమిలో పడితే రైతు ఏడాది శ్రమ వృథా కావడమే కాకుండా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సరైన దిగుబడి రాక కుటుంబ పోషణ భారంగా మారుతుంది. కష్టపడి పంట పండించే రైతును కాపాడాల్సిన వ్యవస్థ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో విత్తనాలు, ఎరువుల దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నకిలీ వ్యాపారులకు కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి అలాంటి వారిని బహిర్గతం చేయాలని రైతులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Telangana
రైతు నమ్మకంతో చెలగాటం... గజ్వేల్‌లో నకిలీ పత్తి విత్తనాల కలకలం
Quick Summary:
భూమిని నమ్మి, ఆకాశాన్ని నమ్మి,
