నేటి సాక్షి గజ్వేల్ :---
ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యాన్నే కొందరు అక్రమ వ్యాపారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. పేదల నుంచి అతి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్న అక్రమ వ్యాపారం గజ్వేల్ పట్టణంలో సాగుతున్నట్లు సమాచారం.
గతంలో పలు దాడులు, కేసులు నమోదైనా ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. చట్టాన్ని లెక్కచేయకుండా, అధికారుల తనిఖీలను తప్పించుకుంటూ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా విశ్వసనీయ సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు గజ్వేల్ పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ కీలక వ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని వద్ద నుంచి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన వారు ఎవరు? బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు? ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతోంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా పనిచేస్తోందా? గతంలో నమోదైన కేసుల్లో నిందితులతో దీనికి సంబంధాలున్నాయా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు లబ్ధిదారులైన పేదల నోటికొచ్చే అన్నాన్ని అక్రమ వ్యాపారులు దోచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Telangana
ప్రభుత్వ బియ్యానికే బ్లాక్ మార్కెట్ బాట..! గజ్వేల్‌లో ముఠా గుట్టురట్టు...! పేదల అన్నంపైనే దోపిడీ... అధికారుల కళ్లుగప్పి కోట్ల దందా...
Quick Summary:
పేదల అన్నంపైనే దోపిడీ...