Telangana
*పాడి క్లీనర్ల అధ్వాన పరిస్థితి* • కొనుగోలు కేంద్రాల్లోనే నిర్లక్ష్యంగా యంత్రాలు • సంరక్షణలో విఫలమైన సంబంధిత శాఖలు
Quick Summary:
సంరక్షణలో విఫలమైన సంబంధిత శాఖలు
*నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతుల ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు అందించిన పాడి క్లీనర్లు ప్రస్తుతం అధ్వాన పరిస్థితికి చేరుకున్నాయి. కొనుగోలు ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ గుల్లకోటతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్దే ఈ యంత్రాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టే స్థితికి చేరుకున్నా సంబంధిత శాఖలు వాటిని స్వాధీనం చేసుకుని భద్రపరచడంలో పూర్తిగా విఫలమయ్యాయని రైతులు, గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన విలువైన యంత్రాలను బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడం వల్ల అవి క్రమంగా దెబ్బతిని వినియోగానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ముగిసిన వెంటనే పాడి క్లీనర్లను సేకరించి సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి పాడి క్లీనర్లను వెంటనే స్వాధీనం చేసుకుని భద్రపరచడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.