*నేటి సాక్షి – కోరుట్ల*
'పెద్దమ్మా...నీకు రూ.4 వేల పెన్షన్ వస్తుందా..? రాకపోతే నేను ఇప్పిస్తా... నాతో బ్యాంకుకు రా' అని పలకరించాడు. ప్రభుత్వ ఉద్యోగిలా నమ్మకంగా మాట్లాడాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన 80 ఏళ్ల వృద్ధురాలు అతడి వెంట నడిచింది. కోరుట్ల బస్టాండ్ నుంచి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు తీసుకెళ్లిన ఆ కేటుగాడు... అక్కడ అసలు నాటకం మొదలుపెట్టాడు..'ఒంటిపై బంగారం ఉంటే పెన్షన్ మంజూరు చేయరు. ముందు గొలుసు తీసి నా దగ్గర పెట్టండి... నేను మేనేజర్‌తో మాట్లాడి అప్లికేషన్ తీసుకొస్తా' అని చెప్పాడు. అమాయకురాలైన వృద్ధురాలు తన మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసు అతడి చేతిలో పెట్టింది. 'ఇప్పుడే వస్తా...' అని వెళ్లిన వ్యక్తి మాత్రం తిరిగి రాలేదు. అప్పటికే తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు కన్నీరుమున్నీరైంది.
*సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు*
పోలీసుల కథనం ప్రకారం... కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన అల్లె భాగీర్త (80) ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోరుట్లలోని బస్టాండ్, ఎస్‌బీఐ పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో అపరిచితులు చెప్పే మాటలను నమ్మవద్దని, పెన్షన్, రుణాలు, నగదు సాయం ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా బంగారం లేదా నగదు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎస్‌ఐ చిరంజీవి ప్రజలకు సూచించారు.
___________
Telangana
*'పెన్షన్ ఇప్పిస్తా పెద్దమ్మాని..'* *బంగారు గొలుసు చోరీ.!* -------------------------- * మాయమాటలతో 80 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించి రెండు తులాల గొలుసుతో ఉడాయించిన కేటుగాడు --------
Quick Summary:
* మాయమాటలతో 80 ఏళ్ల వృద్ధురాలిని నమ్మించి రెండు తులాల గొలుసుతో ఉడాయించిన కేటుగాడు