నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా గారి పర్యవేక్షణలో, తాండూర్ పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించిన సంయుక్త దాడిలో ఆశ్రమంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి, 36 గంజాయి మొక్కలు (సుమారు 28 కిలోల బరువు) స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులోని సర్వే నెం.410లో ఆశ్రమం నిర్వహిస్తున్న జై శ్రీరామ్ గిరి (43) అనే వ్యక్తి తనతో పాటు సాధ్వి సంగం గిరి (45) సహకారంతో రహస్యంగా గంజాయి మొక్కలు సాగు చేస్తూ వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పంచుల పోలీసు బృందంతో కలిసి ప్రణాళికాబద్ధంగా దాడి నిర్వహించారు.
పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని పరిశీలించగా, ఆశ్రమ ప్రాంగణంలో అక్కడక్కడా పెంచిన 36 గంజాయి మొక్కలు గుర్తించారు. ఎక్సైజ్ అధికారుల ద్వారా అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించగా, వాటి ఎత్తు సుమారు 2 నుండి 8 అడుగుల వరకు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మొక్కలను వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకోగా, వాటి మొత్తం బరువు సుమారు 28 కిలోలుగా నమోదైంది. సంఘటన స్థలంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం పంచనామా రూపొందించారు.
ప్రాథమిక విచారణలో ఏ1 జై శ్రీరామ్ గిరి (S/o విశ్వు గిరి మహారాజ్, వయస్సు 43 సంవత్సరాలు, స్వస్థలం – సరోయి గ్రామం, రాజస్థాన్ రాష్ట్రం, ప్రస్తుతం గోవిందరావుపేట గ్రామం, యాలాల మండలం) మరియు ఏ2 సాధ్వి సంగం గిరి (W/o Late సురేష్, వయస్సు 45 సంవత్సరాలు, స్వస్థలం – జల్గావ్ గ్రామం, బసర్ మండి మండలం, రాజస్థాన్ రాష్ట్రం, ప్రస్తుతం గోవిందరావుపేట గ్రామం, యాలాల మండలం) గత కొంతకాలంగా గంజాయి వినియోగిస్తున్నట్లు, సుమారు ఏడాది క్రితం గోవిందరావుపేటలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గంజాయి సాగు చేస్తునట్లు విచారణలో వెల్లడైంది.
విచారణలో భాగంగా సర్వే నెం.410లోని భూమి పప్పులాల్ కుమావత్ (S/o బన్వర్‌లాల్ కుమావత్) పేరుపై నమోదై ఉన్నట్లు రెవెన్యూ అధికారుల ద్వారా నిర్ధారించారు. భూ యజమాని పప్పులాల్ కుమావత్‌ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో A1 : జై శ్రీరామ్ గిరి, A2 : సాధ్వి సంగం గిరి, A3 : పప్పులాల్ కుమావత్ (భూ యజమాని) పై ముగ్గురు నిందితులపై ఎన్ డి సి ఎస్ యాక్ట్ కింద యాలాల్ ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.నిందితుల వద్ద నుండి 36 గంజాయి మొక్కలు (సుమారు 28 కిలోలు), ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు వినియోగంపై జీరో టాలరెన్స్ విధానంతో కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. గంజాయి సాగు చేస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, గంజాయి సాగు లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ దాడిలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, తాండూర్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్, సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, యాలాల ఎస్‌ఐ విట్టల్ రెడ్డి, యాలాల పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పంచ సాక్షులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
యాలాల మండలంలో గంజాయి సాగుపై జిల్లా టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడి. 36 గంజాయి మొక్కలు (సుమారు 28 కిలోలు) స్వాధీనం. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా.
Quick Summary:
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా.