నేటిసాక్షి, నల్లగొండ : అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కారం చూపాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆయన ఉదయాదీత్య భవన్లో రెవెన్యూ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆయా మండలాల వారిగా తాగునీరు, వ్యవసాయం, తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు విపత్తు నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని చెప్పారు. ప్రజలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, అవసరమైతే తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు, మీడియా, ప్రజా ప్రతినిధులతో చర్చిస్తూ, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్డీఓలు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై మాట్లాడుతూ, రానున్న ఒకటి, రెండు రోజుల్లో 90% మ్యాపింగ్ పూర్తి చేయాలని, చివరి వరకు వేచి చూడకుండా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు.
ఈ నెలాఖరునాటికి భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని, జూన్ 15 వరకు ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించడం పూర్తిచేయాలని, ఇంకా ఎంపిక పూర్తి చేయనిచోట తహశీల్దార్, లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. అలాగే లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిన చోట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభానికి ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడతలో భాగంగా గ్రామాల వారిగా గజిటెడ్ అధికారిచే జాబితాను పరిశీలించి పంపించాలని, ఎంపీడీఓల ద్వారా జాబితాను తీసుకొని, ఏ సర్వే నంబర్లలో మంజూరు చేసే ఇండ్ల స్థలాలు ఉన్నాయో, పరిశీలించి, పంపాలని చెప్పారు. అది పట్టానా, లేదా అనే అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు, రెసిడెన్షియల్, బర్త్ సర్టిఫికేట్, కులం ధ్రువపత్రాలను ఇచ్చేందుకు నిర్ణయించడం జరిగిందని, ఈ విషయంపై మండల తహసిల్దారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధ్రువ పత్రాలు జారీ చేయాలన్నారు.
ఎస్ సి, ఎస్ టి కమిషన్ కేసులు, లోకాయుక్త కేసులు, హెచ్ఆర్సీ కేసులు,కోర్టు కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు పై కూడా తహశీల్దార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వవద్దని, ఎన్నికల మాదిరిగానే రీ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ రాష్ట్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్ పాషా,ఆర్డీఓలు వై.అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి దేవరాజ్, తదితరులు హాజరయ్యారు.
Telangana
భూముల రీ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి -ప్రజల మౌళిక వసతులపై దృష్టి సారించాలి -అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలి... -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
Quick Summary:
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
