*నేటి సాక్షి – కోరుట్ల*
"అరే... మన బస్సును ఎవడో తీసుకెళ్తున్నాడ్రోయ్.?" అంటూ డ్రైవర్ ఒక్కసారిగా కేక వేయడంతో కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్‌లో కలకలం రేగింది. కేవలం ఐదు నిమిషాల టీ బ్రేక్... కానీ ఆ ఐదు నిమిషాలే ఓ ఆర్టీసీ బస్సు చోరీకి కారణమయ్యాయి. బస్టాండ్‌లోని 9వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాణానికి సిద్ధంగా నిలిపిన బస్సును గుర్తుతెలియని వ్యక్తి స్టార్ట్ చేసి తీసుకెళ్లడం, వెంటనే డ్రైవర్ బైక్‌పై వెంబడించడం, కోరుట్ల-మెట్‌పల్లి పోలీసులు సినిమాను తలపించేలా ఛేజ్ చేయడం, చివరకు గండి హనుమాన్ ఆలయం వద్ద బస్సు చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం... ఈ మొత్తం ఘటన గంటల వ్యవధిలోనే ఉత్కంఠ రేపింది.
*టీ బ్రేక్... అంతలోనే షాక్.!*
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ ప్రవీణ్, కండక్టర్‌తో కలిసి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సును కోరుట్ల బస్టాండ్‌లోని 9వ ప్లాట్‌ఫాంపై నిలిపి, డిపో ఎదురుగా ఉన్న టీ స్టాల్‌కు టీ తాగేందుకు వెళ్లారు. అంతలోనే తమ బస్సు నెమ్మదిగా బయటకు వెళ్తుండడం డ్రైవర్ కంటపడింది. మొదట మెకానిక్‌లు ట్రయల్ కోసం తీసుకెళ్తున్నారని భావించిన ఆయన వెంటనే వారిని ఫోన్‌లో సంప్రదించగా, 'మేము తీసుకెళ్లలేదు' అనే సమాధానం వచ్చింది. అంతే... బస్సు చోరీకి గురైందని గ్రహించిన ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెంటనే బస్సును వెంబడిస్తూ పోలీసులకు సమాచారం అందించాడు.
*బస్సుతో బీభత్సం... రోడ్డంతా ఉత్కంఠ*
బస్సును నడుపుతున్న దుండగుడు ఏమాత్రం భయపడకుండా కోరుట్ల నుంచి మెట్‌పల్లి మీదుగా నిజామాబాద్ వైపు అతివేగంగా దూసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఎదురైన వాహనాలను తప్పించుకునే క్రమంలో నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వెంబడించిన పోలీసు వాహనానికీ స్వల్ప నష్టం జరిగినట్లు తెలిసింది. రోడ్డుపై ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ప్రజలు భయంతో పక్కకు పరుగులు తీశారు.
*సినిమా ఛేజింగ్‌ను తలపించిన పోలీసుల ఆపరేషన్*
ఆర్టీసీ అధికారులు సమాచారం అందించగానే కోరుట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో మెట్‌పల్లి పోలీసులకూ సమాచారం చేరడంతో రెండు ప్రాంతాల పోలీసులు సమన్వయంతో బస్సును వెంబడించారు. ఒకవైపు డ్రైవర్ తన బైక్‌పై బస్సు వెనుకే వస్తుండగా, మరోవైపు పోలీసు వాహనాలు సైరన్లు మోగిస్తూ ఛేజ్ చేయడంతో రహదారి మొత్తం ఉత్కంఠభరితంగా మారింది.
*గండి హనుమాన్ వద్ద క్లైమాక్స్*
పోలీసులు దగ్గరపడుతున్నారని గుర్తించిన దుండగుడు మరింత వేగంగా బస్సును నడిపాడు. అయితే ఇబ్రహీంపట్నం మండలం జిల్లా శివారులోని గండి హనుమాన్ దేవాలయం సమీపానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టి గుంతలోకి దూసుకెళ్లి ఆగిపోయింది. వెంటనే బస్సులో నుంచి దిగి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
*ఎవరు.? ఎందుకు.? దర్యాప్తులో అసలు కథ.!*
నిందితుడిని మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అతని వివరాలు, మానసిక పరిస్థితి, బస్సును ఎందుకు అపహరించాడు.? పథకం ప్రకారమే చేశాడా.? లేక ఆకస్మికంగా ఈ ఘటనకు పాల్పడ్డాడా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సును స్వాధీనం చేసుకుని తిరిగి ఆర్టీసీ అధికారులకు అప్పగించారు.
*భద్రతపై ప్రశ్నలు... జిల్లావ్యాప్తంగా చర్చ*
డిపోలో అధికారులు, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి నేరుగా బస్సు స్టార్ట్ చేసి తీసుకెళ్లడం ఎలా సాధ్యమైంది.? బస్సు తాళాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి.? భద్రతా లోపం ఎక్కడ జరిగింది.? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కోరుట్ల బస్టాండ్‌లో మొదలైన ఈ 'బస్సు హైజాక్ డ్రామా'... గండి హనుమాన్ వద్ద ముగిసినా, దాని వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన కోరుట్ల, మెట్‌పల్లి మాత్రమే కాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.!
__________________________________
Telangana
*టీ తాగి వచ్చేలోపే బస్సు మాయం.!* -------------------------- * కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు చోరీ.. * సినిమాను తలపించిన పోలీసుల ఛేజింగ్.. * గండి హనుమాన్ వద్ద క్లైమాక్స్ * 'కల్లూరు మోడల్ స్కూల్ ట్రిప్'కు సిద్ధమైన డ్రైవర్.. టీ బ్రేక్‌లోనే బస్సు చోరీ * కోరుట్ల నుంచి నిజామాబాద్ వైపు బస్సుతో పరార్.. * మార్గమధ్యంలో 4 వాహనాలను ఢీకొట్టిన దుండగుడు కోరుట్ల–మెట్‌పల్లి పోలీసుల ఉత్కంఠభరిత ఛేజింగ్.. చెట్టును ఢీకొట్టి ఆగిన బస్సు * పారిపోతుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ----------
Quick Summary:
* కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు చోరీ..

